Saturday 22 June 2013

ఆదర్శ కమ్యూనిస్టు ఆలూరి by -వరవరరావు

ఆదర్శ కమ్యూనిస్టు ఆలూరి

June 22, 2013 [Andhra jyothi editorial]
షహీద్ భగత్‌సింగ్ గురించి బిపిన్‌చంద్ర, ఎజి నూరానీ, చమన్‌లాల్ వంటి చరిత్రకారులు, న్యాయకోవిదులు, పరిశోధకులు శోధించి ఇప్పటికీ వెలికితెస్తున్న ఎన్నో ఉత్తేజకరమైన సంఘటనలు, సందర్భాలు, దార్శనిక భావజాలం కన్నా ముందు తెలుగు పాఠకుల ఒక తరాన్ని విప్లవ భావజాలం వైపు ఆకర్షించిన, నిలిపిన ప్రామాణిక గ్రంథం 'సింహావలోకనం'. భగత్‌సింగ్ సమకాలికుడైన యశ్‌పాల్ భగత్‌సింగ్‌ను కేంద్రబిందువుగా చేసుకుని తాను కూడా తలమునకలుగా పాల్గొన్న విప్లవోద్యమం గురించి రాసిన ఆ గ్రంథం యశ్‌పాల్‌దని గుర్తుపెట్టుకున్నంతగా తెలుగు పాఠకులు దాని అనువాదకుడు ఆలూరి భుజంగరావుగారిని గుర్తుపెట్టుకున్నారా? భగత్‌సింగ్ తల్లి, అన్న కుటుంబం నుంచి ఆయన అరుదయిన జీవిత విశేషాలు విని ఇవాళ్టికీ మిగతా ఎవరికన్నా కూడా భగత్‌సింగ్ దార్శనికతను ఇవాళ్టి సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజాస్వామిక ఉద్యమంలో భాగంగా ప్రచారం చేస్తున్న ఆయన మేనల్లుడు ప్రొఫెసర్ జగమోహన్‌సింగ్ వలె భగత్‌సింగ్ అంతర్‌బహిర్ లోకాలను చూసినవాడు యశ్‌పాల్. ఆలూరి భుజంగరావు అనువాదం చేయకపోతే హిందీలో రాసిన ఆ పుస్తకం తెలుగు పాఠకులకు అందుబాటులోకి వచ్చేదే కాదు.
ప్రేంచంద్ 'రంగభూమి' నవల అంత ఉద్గ్రంథమైనా ఏకబిగిని అది చదివేసిగానీ బయటి ప్రపంచంలోకి రాలేకపోయానని జూన్ 20 సాయంత్రం గుంటూరులోని ఆలూరి భుజంగరావు అంత్యక్రియల దగ్గర నాతో ఒక పాఠకురాలు అన్నది. ప్రేంచంద్ సాహిత్యం, రాహుల్ సాంకృత్యాయన్ సాహిత్యం చదవని బుద్ధిజీవిని, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిని ఊహించుకోవడం కష్టం. హిందీ, ఇంగ్లీషులలో అవి చదువలేనివారు, చదవనివారు అవి మా చిన్నప్పుడే చదివాం గానీ వాటిలో ప్రేంచంద్ 'గబన్', 'నోరా', రాహుల్ సాంకృత్యాయన్ 'జయÄౌధేయ', 'విస్మృత యాత్రికుడు', 'దివోదాసు', 'దర్శన్ దిగ్దర్శన్' (ప్రాక్పశ్చిమ దర్శనాలు) మొదలయిన పుస్తకాలను ఆలూరి భుజంగరావు గారు అనువాదం చేసారని గుర్తుపెట్టుకోలేదు, ఆయనతో పరిచయం చేసుకోవాలని అనుకోలేదు అని బాధపడిన వాళ్లు కూడా ఉన్నారు. ఆలూరి భుజంగరావుగారు కిషన్‌చందర్ 'వాయుగుండం', 'పరాజయం' నవలలు కూడా అనువదించారు.

అయితే ఇదంతా ఐక్య కమ్యూనిస్టుపార్టీ, ఆ ప్రచురణ సంస్థలు 1930ల నుంచి 50ల వరకు నెలకొల్పిన ఉత్తమ విలువలు తెలిసినవారికి ఆశ్చర్యకరమైన విషయాలు కావు. గొప్ప సృజనాత్మక రచయితలందరినీ గొప్ప అనువాదకులుగా కూడా తీర్చిదిద్ది అనువాదం కోసమే ఒక సమర్థవంతమైన రచయితల బృందాన్ని తయారుచేసిన ఘనత కూడా ఐక్య కమ్యూనిస్టు పార్టీదే. తెనాలిలో సుప్రసిద్ధ నవలా రచయిత శారద కృషియైనా, ఆ తర్వాత కాలంలో గుడివాడలో 'సాహిత్యనికేతన్' ఏర్పాటు చేసి ఆలూరి భుజంగరావు గారు చేసిన కృషియైనా పూర్తిగా అట్లా ఒక నిర్మాణంలో భాగమని చెప్పలేం.

నక్సల్బరీ 'వసంత మేఘగర్జన' తర్వాత కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించిన ఏకైక వ్యక్తి మాత్రం ఆలూరి భుజంగరావు. సమకాలీన చేదునిజాలను యశ్‌పాల్ చెప్తే ఆయన మాటలు ఈ లోకానికి చెప్పాల్సినవని అనుకున్నాడు. 1968 తర్వాత సరోజ్‌దత్తా చెప్తే కూడా ఇవి ఇవాళ్టి అవసరాలు, ఈ తరం తెలుసుకోవాల్సిన వాస్తవాలు అనుకొని అనువాదం చేసాడు. విగ్రహారాధనగా మారి భారత పునర్వికాస పితృత్వాల చర్విత చరణాలను సరోజ్‌దత్తా సాహసంగా ప్రశ్నిస్తే ఆ చిన్న చిన్న పొత్తాలను భుజంగరావుగారు తెలుగులోకి అనువదించి నక్సల్బరీ తరానికి అందించారు. 'గాంధీజీ' పై 'మరోసారి ఈ దేశం మోసపోకూడదు' వంటి కవితలు ఇటువంటి రచనలు తెలుగులో వెలుగు చూడకుండా సాధ్యమయ్యేవి కావు.

సామాజిక మార్పును కోరే నిజాయితీ కల బుద్ధిజీవికి ఆలూరి భుజంగరావు జీవితం ఒక ఆదర్శం. అటువంటి జీవితం ఎనభై అయిదేళ్లు గడవగలగడమనేది నిజంగానే ఆసిధారావ్రతం. ఆ జీవితం కూడా ఎట్లా మొదలయింది - దుర్భరంగా, ఇవ్వాళ మనం ఊహించుకోలేని అష్టదరిద్రంలో. ఆంధ్రాప్యారిస్ అని పిలుచుకున్న తెనాలిలో ముగ్గురి జీవితం అట్లా మొగ్గదొడిగింది. బురదగుంటలో చావకుండా బతికిన చిగురువలె, సుడిగాలికి తట్టుకొని నిలిచిన గడ్డిపోచవలె. ఆ ముగ్గురు 'శారద' పేరుతో 'మంచీచెడూ', 'అపస్వరాలు', 'ఏదీసత్యం' - వంటి జీవిత సత్యాలను ఆవిష్కరించిన నవలలు, కథలు రాసిన నటరాజన్ అనే తమిళుడు, ఆలూరి భుజంగరావు, ప్రకాశం. ప్రకాశం ఈ ముగ్గురి బృందానికి కమ్యూనిస్టు భావజాలాన్ని అంటించిన నాయకుడు. భుజంగరావుగారి తెనాలి జీవితంలో ఇంతే దుర్భరమైన జీవితాన్ని అనుభవించిన రావూరి భరద్వాజ కూడా ఉన్నారు. ఆలూరి భుజంగరావు హోటల్ వర్కర్‌గా పనిచేస్తూ, చదువు, రచన ఒక వ్యసనంగా గడిపిన బాల్యం, నవయవ్వనాల గురించి 'శారద'ను కేంద్రస్థానంలో పెట్టి రాసిన 'సాహిత్యబాటసారి శారద', తన తర్వాత జీవితాన్ని కూడా ఆవిష్కరించిన 'గమనాగమనం', 'గమ్యం దిశగా గమనం' పుస్తకాల్లో చదువుతూ ఉంటే ఇన్ని కష్టాలు తట్టుకొని, ఇంత దారిద్య్రాన్ని, ఇంత ప్రమాదాన్ని ఎదుర్కొని ఈ బక్కపలచని మనిషి నిండుజీవితం ఎట్లా గడిపాడా అని ఆశ్చర్యం వేస్తుంది. అయితే 'శారద' బతికున్నంతకాలం (చాలా అల్పాయుష్కుడుగా, దారిద్య్రం నుంచి విముక్తి లేకుండా దారిద్య్రానికే ఎర అయ్యాడు 'శారద') ఆలూరి భుజంగరావు సృజనాత్మక రచనలు ఆయనే చేయాలనుకున్నాడు.

ఆయన జీవితంలోని మూడు దశల్లో మూడవ దశలో అరవయ్యో, డెబ్బయ్యో పడిలో గానీ ఆయన ఎక్కువ సృజనాత్మక రచనలు చేయలేదు. 'కొండవాగు', 'ప్రజలు అజేయులు' వంటి నవలలు, 'అరణ్యపర్వం' వంటి కథలు - అన్నీ ఆయన కమ్యూనిస్టు జీవితంలోని, విప్లవోద్యమంలోని స్వానుభవాలు.
'సాహిత్యబాటసారి శారద'లో మనకు ఆయన శారద వంటి ఒక నిప్పులో పుటం పెట్టిన సాహిత్య నిమగ్నజీవిని పరిచయం చేస్తూ, ఆ పరిచయ క్రమంలో దేశ, కాల, పాత్రల్లో శారదను, తనను లొకేట్ చేస్తే, 'ప్రజలు అజేయులు'లో 1980, 90లలో తెలంగాణలో జరిగిన విప్లవోద్యమం, అందులో నల్గొండ జిల్లా పీపుల్స్‌వార్ కార్యదర్శిగా అమరుడైన కిరణ్ చుట్టూ ఆ రెండు దశాబ్దాల ఆటుపోటులను చిత్రించాడు. కోరుట్లలో రాడికల్ ఉద్యమంతో ఆకర్షితుడైన కిరణ్ పూర్తికాలం విప్లవకారుడుగా మారి పీపుల్స్‌వార్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి నల్లగొండ జిల్లా విప్లవోద్యమ నిర్మాణం చేస్తూ కార్యదర్శి అయి యాదగిరిగుట్ట పోలీసుస్టేషన్‌పై దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకొని సాహసికంగా తప్పించుకుంటున్నప్పుడు మూసీనది ఉప్పొంగి దారులు మూసుకుపోయి పోలీసులకు ఎదురుపడి 'ఎన్‌కౌంటర్' అయిన కథనం కల్పన కన్నా గగుర్పొడిచే వాస్తవం. ఆ కిరణ్ స్వయంగా భుజంగరావుగారి అల్లుడు. ఆలూరి భుజంగరావు గారు ఒంటరి విప్లవ పరివ్రాజకుడు కాదు. నిన్నటిదాకా ఆయన వేలుపట్టుకొని ఏభైఏళ్లుగా ఆయనతో విప్లవ పథంలో నడుస్తున్న లలితగారితో పాటు ఆయన తన నలుగురు కూతుళ్లనూ విప్లవోద్యమంలోకి తెచ్చాడు. తెచ్చాడంటే తన బహిరంతర ఆచరణలో అటువంటి వాతావరణాన్ని కల్పించాడు. ఆ తర్వాత కాలంలో వాళ్లు ఎటువంటి జీవితాలను ఎంచుకున్నా ఆయన రక్తబంధుత్వం కూడా వర్గబంధుత్వ దృక్పథాన్ని నిలుపుకునే తనదైన ఒక జీవితాదర్శాన్ని ఆయన వదిలిపోయాడు.
గుడివాడలో హిందీపండిట్‌గా పనిచేసిన కాలంలో ఆయనకు గంజిరామారావు, మునిస్వామిగార్లతో పరిచయం, గాఢానుబంధం ఏర్పడింది. అదే ఆయనను విప్లవ రాజకీయాల్లోకి తెచ్చింది. 1986లో ఉద్యోగ విరమణ తర్వాత ఆయన పూర్తికాలం అనువాద దశనుంచి విప్లవం కోసం సాహిత్య కృషి చేసే పనిని ఎంచుకున్నాడు. 1984లో లేటు వయసులో విప్లవంపై ఘాటుప్రేమతో విరసంలో చేరాడు. అక్కడ కూడా ఆగకుండా ఆరు సంవత్సరాల పాటు అజ్ఞాత జీవితంలో గడిపి దండకారణ్య విప్లవోద్యమం నిర్వహిస్తున్న 'ప్రభాత్' హిందీపత్రిక సంపాదకవర్గంలో బాధ్యతలు పంచుకున్నాడు.
ఐక్యకమ్యూనిస్టు పార్టీ దశలో రాహుల్ సాంకృత్యాయన్, ప్రేంచంద్, కిషన్‌చందర్, యశ్‌పాల్ వంటి రచనలు అనువదించడానికి ఎంచుకున్నట్లే నక్సల్బరీ, శ్రీకాకుళం, జగిత్యాల, దండకారణ్య విప్లవోద్యమ దశలో తెలుగు నుంచి హిందీలోకి 'విప్లవసాహిత్యాన్ని' అనువాదం చేసి దేశానికంతా తెలంగాణ, దండకారణ్య విప్లవోద్యమాలను పరిచయం చేసాడు. సాధన రాసిన 'రాగో' నవల, సికాస కథలు 'బొగ్గుపొరల్లో', విరసం సంకలనం చేసిన 'నేలతల్లి విముక్తికోసం' కథలు, దండకారణ్య అమరవీరులు, అల్లంరాజయ్య కథ 'అతడు' హిందీలోకి అనువాదం చేసాడు.
ముప్పై ఏళ్లుగా విరసంలో సభ్యుడుగా ఆయన క్రమశిక్షణ గురించి చెప్పాలి. ఆయన, లలితగారు ఆయన ఆరోగ్యం అనుమతిస్తే రాకుండా ఉండే సభ, సమావేశం ఉండవు. శ్రద్ధగా వినాలి, చర్చలో పాల్గొనాలి, అంతే కాదు ఇద్దరూ చంకకు తగిలించుకుని తెచ్చే పుస్తకాలు పరచి అవి సభాస్థలి దగ్గర అమ్ముతూ కూచోవాలి. ఏకకాలంలో ఒక బుద్ధిజీవిగా, ఒక కార్యకర్తగా, అన్నిటినీ మించిన సాంస్కృతిక యోధునిగా ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా ఇప్పటి తరానికి ఒక కఠోరమైన ఆచరణ నమూనాగా నిలిచిపోయాడు. కెవిఆర్ విప్లవ రచయితల సంఘం అనే పదసముదాయంలో విప్లవం, రచన, సంఘచైతన్యం - ఏ ఒక్కటీ తక్కువ చేయాల్సింది కాదు అని అంటుండేవాడు. ఆలూరి భుజంగరావుగారి జీవితం విరసంకు రెట్టింపు గనుక ఆయనను అంతకన్నా మించిన ఆదర్శ కమ్యూనిస్టుగా ఆవాహన చేసుకోవడం ఈ తరానికి సార్థకమైన స్ఫూర్తి.
- వరవరరావు
 

Thursday 20 June 2013

ఆలూరి భుజంగరావ్ అస్థమయం- 20 june 2013

Sarada(S.Natarajan) friend and writer of Sarada biography "Sahithya batasdari sarada/Smruthi sakalalu" , Aaloori Bhujangarao died on 20-june-2013 in Guntur, Andhrapradesh. May his soul rest in peace.






KiranPrabha Talk show on writer Sarada(S.Natarajan)

KiranPrabha Talk show on writer Sarada(S.Natarajan):

http://www.youtube.com/watch?v=FxIpWTeuV7s


PS: Thanks to Kiran Prabha garu for making this.

హరిశ్చంద్రుడు(కథ)


Please read హరిశ్చంద్రుడు(కథ)by Sarada:
[printed recently in Telugu velugu 'Apr ' 2013 issue]


http://www.scribd.com/doc/149016460/Harishchandrudu-sarada


PS: Thanks to Ravi kiran for sharing this.