Tuesday 5 August 2014

విలువల్ని నిలదీసే శారద నవలలు by శ్రీశాంతి దుగ్గిరాల

link: http://lopalialalu.blogspot.in/2013/11/blog-post_22.html

Thanks to Srisanthi duggirala  for allowing me to post this in this blog.


Friday, 22 November 2013

విలువల్ని నిలదీసే శారద నవలలు

శారద గారి అసలు పేరు ఎస్. నటరాజన్ గారు. ఈయన తమిళదేశస్తుడు. పన్నెండేళ్ళప్పుడు తెనాలి వచ్చారు. చిన్ననాటి నుండి తమిళ సాహిత్యంపై మక్కువతో ఆ వయసులోనే పలు రచనలు చదవారు. తనకున్న పఠనాశక్తి వల్ల తెనాలి రాగానే తెలుగు భాష కూడా నేర్చుకొని ఎన్నో రచనలు చదవడమే కాక తోటివారికి చెపుతుండేవారు.

నటరాజన్ గారు తెలుగు భాషలో పలు కథా, నవలా రచనలను చేసారు. వారి మొదటి రచన “ప్రపంచానికి జబ్బు చేసింది”. ఆయన రచనల్లో నేను ప్రస్తుతం చదివింది పర్‌స్పెక్టివ్స్ వాళ్లు ప్రచురించిన “శారద నవలలు”. ఇందులో మెుత్తం మూడు నవలలు ఉన్నాయి. అవి: “ఏది సత్యం”, “మంచీ చెడు”, “అపస్వరాలు”.

ఏది సత్యం

పార్వతి భర్త సాంబశివరావు. రైసు మిల్లులో సూపర్ వైజర్ గా పనికి కుదిరాడు. వారి సంసారం చక్కగా సాగుతున్న తరుణంలో, సాంబశివరావుకు రైసు మిల్లులో ఒక ప్రమాదం జరిగి కాలు విరిగిపోతుంది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా, సుఖంగా సాగుతున్న వారి సంసారంలో కష్టాలు ప్రవేశించాయి. ఇల్లు గడవడం భారంగా మారింది. సంసార భాధ్యత అమాయకురాలైన పార్వతి పై పడింది. పొరుగింటి వారి సహాయంతో చిన్న ఉద్యోగంలో చేరింది పార్వతి.
పార్వతి ఉద్యోగం చేయడం సాంబశివరావుకు ఇష్టం ఉందదు గానీ, పొరుగు వారి బలవంతం మీద, ఇల్లు గడవడానికి వేరే మార్గం లేక ఒప్పుకుంటాడు. రోజంతా ఇంటిపట్టున ఒంటరిగా గడిపే సాంబశివరావు పార్వతి మీద అకారణంగా ద్వేషాన్నీ, అనుమానాన్నీ పెంచుకున్నాడు. అకారణంగా భార్యని బాధించి కొంత ఆనందించేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతనిలోని అనుమానం పెనుభూతమై వారి సంసారాన్ని దహించివేసింది.
అణుకువ, అందం, అమాయకత్వం కలిగిన అమాయకురాలు. భర్తను కాపాడుకోవాలనే ఆశతో ఎన్ని కష్టాలు ఎదురైనా మెుండిగా ఎదిరించింది. శరీరమే కాదు మనసూ అవిటిదని తన చర్యల ద్వారా నిరూపించాడు సాంబశివరావు.

మంచీ చెడు

యాభై ఏళ్ళ భద్రయ్య ఇరవై కూడా నిండని అమ్మాయిని పెళ్ళాడతాడు. భద్రయ్య ఇరవై ఏళ్ళ కుమారుడు భాస్కర్రావు పట్నంలో చదువుకుంటున్నాడు. పెళ్ళి విషయం తెలిసినా తండ్రి నిర్ణయానికి ఎదురు చెప్పలేకపోతాడు. తన కంటే చిన్నదాన్ని తండ్రి పెళ్ళాడటంతో మనసులోనే బాధ పడతాడు.

భద్రయ్య వ్యాపార మిత్రుడు సుదర్శనం. అతని మొదటి భార్య చనిపోయాకా రెండో పెళ్లి చేసుకుంటాడు. మొదటి భార్యతో అతనికి ఒక కూతురు. ఆమె పేరు సరోజిని. కొత్తగా వచ్చిన సవతి తల్లి ఆమెను నానా బాధలు పెడుతుంది. ఒకసారి పొయ్యిలో తోస్తే ఆమె ముఖం కాలి అందవిహీనంగా తయారవుతుంది. అప్పటి నుంచీ తండ్రి సుదర్శనం ఆమెను మేలి ముసుగులో దాచి ఉంచుతాడు. అతను ఆమెను తన స్నేహితుడు భద్రయ్య కొడుకు భాస్కర్రావుకి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. కాని సరోజిని రూపు నచ్చని భాస్కరం ఆమెను తిరస్కరిస్తాడు. కోపం పట్టలేని సుదర్శనం వారిపై పగ పట్టి వారి ఆస్తిని కాజేస్తాడు.

ఆస్తిపోయి పేదవారుగా మిగిలిన భద్రయ్య కుటుంబానికి కొడుకే ఆదారమౌతాడు. పుండు మీద కారంలా వాళ్ల ఇల్లు కూడా తగలబడటంతో అంతా కట్టు బట్టలతో రోడ్డున పడతారు. భాస్కర్రావు చిన్న బట్టల దుకాణంలో గుమస్తాగా పని చేస్తూ కుటుంబ బాధ్యత మోస్తాడు.  కొన్ని రోజులకు భద్రయ్య కాలం చేస్తాడు.

భద్రయ్య భార్య పద్మ ఆ పేదరికాన్ని భరిచలేక పెడ దారి పడుతుంది. ఫలితంగా గర్భం దాల్చి ఎవరికి కనిపించకుండా వెళిపోతుంది. భాస్కర్రావు ఎన్నో కష్టలు అనుభవించి అందరిలో మంచి పేరు సంపాదించుకుంటాడు. పెడదారి పట్టిన పద్మ జీవితం ఎన్నో చేతులు మారి చివరకు వెలయాలిగా మిగిలిపోతుంది.
ఈ కథకు సమాంతరంగా సుదర్శనం కూతురు సరోజిని కథ కూడా నడుస్తూంటుంది. భాస్కర్రావు కాదన్నాడన్న పట్టుదలతో సుదర్శనం ఆమెను శంకరం అనే అనామకునికి ఇచ్చి పెళ్ళి చేస్తాడు. అతను దుర్వ్యసనపరుడు. సుదర్శనం డబ్బుకు ఆశపడి సరోజినిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెను నానా బాధలు పెడతాడు. అతని సుఖవ్యాధులన్నీ ఆమెకు సంక్రమించి ఆమె అకాల మరణం చెందుతుంది.

అపస్వరాలు 

రంగయ్యగారు తెలుగు పండితుడు. కొడుకు సదానందం మృదు స్వభావం, కళలయందు ఆసక్తి కలవాడు. కూతురు జయ పెళ్ళయినా కట్నం డబ్బులు ఇచ్చుకోలేక పుట్టింట్లోనే ఉండిపోయింది. ఈ మధ్య తరగతి సంసారాన్ని రంగయ్యగారే ఎన్నో ఆర్థిక ఇబ్బందులకోర్చి నెట్టుకొస్తున్నాడు.

రంగయ్య గారి వియ్యంకుడు వకీలు శేషాద్రిరావు ధనవంతుడే అయినా డబ్బు మీది వ్యామోహం చావని వాడు. ఈయన వంశోద్ధారకుడు త్రయంబకరావు. కూతురు రమణమ్మ వైదవ్యంతో పుట్టినింటే ఉంటుంది. తల్లితండ్రులు తమ్ముని సంసారం చేజేతులా నాశనం చేస్తున్నారని గమనించి, ధైర్యంగా వ్యవహరించి భార్యను కాపురానికి తెచ్చుకోమని తమ్ముణ్ణి హెచ్చరిస్తూ ఉంటుంది.

రంగయ్యగారు వచ్చే రెండు వందలూ సరిపోక రచనలు చేస్తూంటాడు. పబ్లిషరు మోసగిస్తాడు. చివరికి ఆయన తన కంటి చూపును కూడా పోగొట్టుకుంటాడు.

వరదరాజులు మరో పాత్ర. రౌడీగా జీవితం మొదలుపెట్టి డబ్బు సంపాదిస్తాడు. కానీ తప్పు చేసి సంపాదించిన డబ్బు సుఖాలిచ్చినా మనశ్శాంతిని ఇవ్వలేక పోయింది. ఉన్న డబ్బుతో ఎవరికీ సాయపడడు గానీ, అందరిపై జాలిని ప్రేమను మాత్రం ప్రదర్శిస్తాడు. అది ఎవరికీ అక్కరకు రాదు.

కట్నాల దాహం వల్ల కుటుంబాల్లో సంభవించే అనర్థాలు, చదువు సంధ్యాలేని పబ్లిషర్లు రచయితలపై చూపే అనాదరణ, ఎన్నికల్లో డబ్బును ఎరగాచూపి అక్రమంగా గెలవాలని చూసే రాజకీయ నాయకులు, నాటకాల పేరుతో తమ కళాకారులను వశపరచుకొనే స్వార్థపరులు... ఇలాంటి పాత్రలతో కిక్కిరిసిన ఈ నవల సాటివారి కోసం ఆలోచించలేని సమాజాన్ని చిత్రిస్తుంది.

నా అభిప్రాయం

డబ్బు జీవించడానికి ఎంతో అవసరం, కానీ దాన్ని కష్టించి సంపాదించినపుడే విలువ. అలాక్కాక అన్యాయంగా ధనాన్ని అర్జించటం, ఇంకా ఇంకా అర్జించాలనే పేరాశ, దాన్ని ఎలా ఖర్చు చేయాలో తెలియక స్వార్థంతో కరుడుగట్టిపోవటం, పేదవారనే కనికరం లేకపోవడం... ఇలా ధనం వల్ల మనుషుల మనస్తత్వాలు క్రమేణా ఎలా మారతాయో ఈ నవలల్లో చూపిస్తాడు రచయిత. ఆనాటి మధ్యతరగతి సమాజంలో ఆడదానికి ఉన్న విలువను, వారికి జరిగిన అన్యాయాలను ఎత్తి చూపిస్తాడు. సమాజంలో చోటు చేసుకున్న వ్యాపార విలువల నగ్న స్వరూపాన్ని చిత్రిస్తాడు.

శారద నవలలన్నీ ఆయన చుట్టూ ఉన్న ఆనాటి కాలమాన పరిస్థితుల నుండి, ఆయన అనుభవించిన కటిక దారిద్ర్యం నుండి పుట్టినవి గానే తోస్తాయి. తన లాంటి బడుగు జీవుల కథల్నే ఇతివృత్తాలుగా తీసుకున్నాడు. ఆనాటి సమాజంలో అరాచకాన్నీ, అవినీతిని తనదైన బాణిలో ఎదుర్కొన్నాడు.

ఆయన శైలి సరళంగా ఉండి చదివేవారికి కథ తప్ప వేరే ఆలోచన రాకుండా చేస్తుంది. ఎక్కడా తమిళ వాసనలు లేకుండా అచ్చ తెలుగు గుభాళింపులతో సాగుతుంది. తెలుగువాళ్లే తెలుగు సరిగా రాయలేకపోతున్న కాలం ఇది. నేటి తరానికి ఆయన ఒక ప్రేరణగా నిలుస్తాడు.

ఏ వ్యక్తినైనా మన కళ్ళ ముందు ఉండగా వారి గొప్ప తనాన్ని గుర్తించలేని గుడ్డి సమాజంలో  జీవిస్తున్నాం మనం. అలా నిర్లక్ష్యానికి గురై చిన్న వయసులోనే చనిపోయిన రచయిత శారద. ఆయన మరణించినా ఆయన చేతి నుండి రాలిన అక్షరాలు  మన హృదయ ఫలకాలపై శాశ్వతంగా నిలిచే ఉంటాయి.